నా ప్రియ మిత్రులారా, ఈ దినమున మిమ్మును కలుసుకొనుటకు నేను ఎంతో ఆనందించుచున్నాను. మనము దేవుని వాక్యమును వినుచున్నప్పుడు, ఆయన యొక్క ఆనందము మన హృదయములలోనికి వచ్చుచున్నది. ఈ దినము కొరకైన వాగ్దానము, 1 సమూయేలు 17:47 నుండి అనుగ్రహించబడినది, “యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడుకాడని యీ దండు వారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును.” ఇది ఎంత శక్తివంతమైన వాక్యము! ఈ వచనములో నుండి ముందుగా దేవుడు చేయు యుద్ధము, నా దృష్టికి వచ్చుచున్నది.
నా ప్రియులారా, మీ జీవితములోని యుద్ధము ఇతరుల వలన కలిగినదని మీరు అనుకొనవచ్చును. అవును, వారు మిమ్మును వ్యతిరేకించుచుండవచ్చును లేక మీకు వ్యతిరేకముగా సమస్యలు తెలెత్తుచుండవచ్చును కానీ యుద్ధము యెహోవాదే అని జ్ఞాపకముంచుకోండి. ఇది కేవలం ఎవరో మీ మీద చేయుచున్న పోరాటము కాదు కానీ, ఇది మీ జీవితములో అనుమతించబడిన దేవుని పోరాటము.
ఎందుకు? ఈ వచనములోని తరువాతి భాగము ఈవిధంగా సెలవిచ్చుచున్నది, “ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును”. ఈ కార్యములన్నియు మీ హస్తములలోనికి వచ్చును. ఎవరైన మీ యొద్ద నుండి ఆస్తులను దొంగిలించుచున్నట్లయితే, అవి తిరిగి మీ చేతికి వచ్చును. ఆ శత్రువులు సహితం మీ కాళ్ల వద్దకు వచ్చి పడుదురు. అక్కడ ఉన్న వారందరు, దేవుడు వారిని రక్షించునని ఎరిగియున్నారని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. మీ ద్వారా మరియు మీ కొరకు, ప్రభువు రక్షించును. మీ జీవితములో దేవుడు క్రియ చేయుటను ప్రజలు చూచెదరు మరియు వారు ఆయనకు భయపడుదురు. ఆయనకు భయపడుట మాత్రమే గాక, వారు మీకు కూడ భయపడుదురు మరియు మీకు సమర్పించుకొని, “దేవుడు మాకు కీడు చేయకుండునుగాక” అని చెప్పెదరు. ఇది దేవుని యుద్ధము. దేవుడు మీ కొరకు యుద్ధము చేయుట ఆ ప్రజలు చూచెదరు. కనుక ప్రియులారా, భయపడకండి. ఈ యుద్ధములో దేవుడు మిమ్మును రక్షించునని గ్రహించండి. మీరు భరించలేనంత శోధనను ప్రభువు మీ జీవితములో అనుమతించడని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినది. ఆ శోధనలను ఎదుర్కొనుటకు ఆయన మీకు శక్తినిచ్చును మరియు దాని నుండి తప్పించుకొనుటకు కూడ ఆయన ఒక మార్గమును చూపించును.
ఒకసారి, మన సంస్థలో ఏదో లోపం ఉన్నదని ఒక ప్రభుత్వ ఏజెన్సీకి సమాచారం అందుట వలన, వారు వచ్చి మమ్మల్ని పూర్తిగా తనిఖీ చేయబోవుచున్నారని మాకు తెలిసింది. మానవపరంగా ఆలోచిస్తే, మాకు భయం కలిగింది. ఈ సమాచారమేమిటి? ఏం తప్పు జరిగి ఉండును? అని అనుకొన్నాము. కానీ ప్రియులారా, ఇది దేవుని యుద్ధము. వారు వచ్చి సమస్తము తనిఖీ చేసి, ఏ తప్పు లేదని నిర్ధారించారు. మన సంస్థలో సమస్తము సరిగ్గా నిర్వహించబడినది. ఇది అద్భతము! మనము భయపడుటకు ఏమీ లేదు. ఇది దేవుని యొక్క యుద్ధము అని మనము గ్రహించవలెను మరియు ఆయన మనలను రక్షించును. ఆయన మన కొరకు యుద్ధము చేయును మరియు ఇది నిజాయితీ కలిగిన సంస్థ అనియు, ప్రభుత్వము దృష్టిలో సహితం సమస్తమును స్పష్టముగా నిర్వహించుననియు ప్రతిఒక్కరు తెలుసుకొనునట్లు ఆయన చేసెను. అదేవిధంగా, మీరు సమస్త కార్యములను సక్రమముగా చేయుదురని మీ శత్రువులకు కూడా ఆయన తెలియజేయును. వారు అందుకు మిమ్మల్ని గౌరవించెదరు.
కనుక, నా ప్రియ స్నేహితులారా, భయపడకండి, యుద్ధము యెహోవాదే. ఆయనను విశ్వసించండి మరియు ఆయన మీ కొరకు యుద్ధము చేసి, మీ జీవితములో విజయమును కలుగజేయును. ప్రభువు ప్రతి పోరాటము నుండి మిమ్మల్ని విడిపించి, ఆయన యొక్క యథార్థత మీ జీవితములో ప్రత్యక్షపడునట్లు చేయును. దేవుడు మిమ్మును దీవించును గాక!
ప్రార్థన:
ప్రియ ప్రభువా, ప్రతి యుద్ధము నీదే అని నాకు జ్ఞాపకము చేసినందుకై నీకు స్తోత్రములు. ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు, సమస్యలు తలెత్తినప్పుడు మరియు నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనినప్పుడు, భయపడకుండ ఉండుటకు నాకు సహాయము చేయుము. నా కొరకు పోరాడి, నేను స్థిరముగా నిలబడుటకు నాకు బలమునిమ్ము. నీవు నాకు అప్పగించిన సమస్తమును రక్షించుము మరియు కోల్పోయినవన్నిటిని పునరుద్ధరించుము. నీ యెదుట యథార్థముగా నడుచుకొనుటకు నాకు జ్ఞానమును, నిజాయితీని మరియు ధైర్యమును అనుగ్రహించుము. నీ చిత్తము ప్రకారము, ప్రతి పరిస్థితి పరిష్కరించబడును గాక. నీవు నాకు తోడైయున్నావని తెలియజేయుము మరియు నా జీవితము, నీ నామమునకు ఘనత తీసుకొనివచ్చును గాక. పరిపూర్ణ విజయమును, విడుదలను నాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


