నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. ప్రభువు మీకు తన సమాధానమును మరియు సంతోషమును, దీవెనలను మీకిచ్చి మిమ్మును దీవించును గాక. నా ప్రియులారా, అనేకసార్లు శ్రమనొందుతాము. రోజువారి సమస్యల ద్వారా మనము శ్రమనొందుతాము. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 21:44వ వచనమును ధ్యానించుకుందాము. ఆ వచనము, "యెహోవా వారి పితరులతో ప్రమాము. చేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను'' అని చెప్పబడిన ప్రకారముగా దేవుడైన యెహోవా అన్నిదిక్కుల నుండి వారికి విశ్రాంతిని ఇస్తానని దేవుని వాక్యము అంటున్నది. ఆ వచనము ప్రకారము ప్రభువు నేడు మీకిచ్చుచున్న వాగ్దానము ఇదియే. నేడు మీకు విశ్రాంతి కావాలా? మీకు సమాధానము కావాలా? సంతోషము మరియు ఆనందము, ఓదార్పు, ఆదరణ కావాలా? అయితే, ప్రభువు " నేను మీకు విశ్రాంతినిస్తాను, మీరు నా యొద్దకు రండి'' అంటున్నాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 11:28 వ వచనములో చూచినట్లయితే, " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని చెప్పబడిన ప్రకారముగా దేవుడు నేడు మీకు విశ్రాంతినివ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. నా స్నేహితులారా, మీరు అనేక చింతల ద్వారా భారమును మోయుచున్నారా? తద్వారా, ప్రజలు మిమ్మును ఇబ్బంది పెట్టుచున్నారా? మీ చుట్టు అప్పులు ఉన్నాయని ప్రజలు మిమ్మును ఇబ్బంది పెట్టుచున్నారా?అయితే, దేవుడు, "నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను'' అని అంటున్నాడు. కనుకనే, దైర్యముగా ఉండండి.
నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఏలాగున ఉన్నారు? దేవునితో అన్యోన్య సహవాసమును కలిగియున్నారా? అందుకే బైబిల్ నుండి హబక్కూకు 3:16 వ వచనములో చూచినట్లయితే, " నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి'' అని చెప్పబడినట్లుగానే, శ్రమ దినములలో ఆయన తన సైన్యములతో వారిని ఆహ్వానించును. మనము శ్రమ దినమున ఆయన సన్నిధిలో కనిపెట్టుకొనియున్నప్పుడు నిశ్చయముగా మీకు విశ్రాంతి కలుగుతుంది. అందుకే బైబిల్ నుండి మత్తయి 11:28 వ వచనములో చూచినట్లయితే, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని ప్రభువు అంటున్నాడు. అయితే, ఆయన విశ్రాంతి లేక ఆదరణను మనకు ఎలాగున ఇస్తాడు? అందుకే బైబిల్ ఇలాగున అంటున్నది, ' ఆయన వాక్యము ద్వారానే. ' కనుకనే, నా ప్రియులారా, మీరు ఎంత అధికముగా వాక్యమును చదువుతారో, మీరు అంత అధికముగా ఆదరించబడతారు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 15:4వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి'' అని చెప్పబడిన ప్రకారముగా, ఓర్పు వలనను, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుతుంది. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 119:50వ వచనమును చూచినట్లయితే, " నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యము మనలను బ్రతికించుచున్నది. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 94:19వ వచనములో చూచినట్లయితే, " నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యము మన ప్రాణమునకు గొప్ప ఆదరణను కలుగజేయుచున్నది. కాబట్టి, నా ప్రియులారా, దేవుని వాక్యమును ఎంత అధికముగా మనము చదువుచున్నట్లయితే, అంత అధికముగా ఆదరణను మనము పొందుకుంటాము. ఎందుకనగా, దేవుని వాక్యములో జీవము ఉన్నది. కనుకనే, ఆ వాక్యము మనకు నెమ్మది కలుగజేయుచున్నది.
నా ప్రియులారా, ఎందుకనగా, దేవుని వాక్యములో నిశ్చయముగా జీవము ఉన్నది. నిజంగా, అందులో జీవము కలదు. సరైన సమయంలో దేవుని వాక్యము మీతో మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో మీరు వేచియుంటూ, కనిపెట్టుకొనియున్నప్పుడు తగిన సమయములో దేవుడు మీ యొద్దకు వచ్చి, మీకు విశ్రాంతి నిస్తాడు. వేరొక మార్గమే లేదు. మీరు మీ యొక్క పూర్ణ హృదయముతో ఆయనను వెదకండి. మీకు వీలైనంత వరకు దేవుని వాక్యమును మీరు ఎంత అధికముగా దేవుని వాక్యమును చదువుకుంటారో అంత అధికముగా మీకు విశ్రాంతినిస్తాడు. హల్లెలూయా! ఆ వాక్యము మీకు ఆదరణను కలిగిస్తుంది. ప్రభువు మీతో మాట్లాడుతాడు. ప్రభువు మీ మొఱ్ఱలను ఆలకించి, మీకు ఆదరణను కలుగజేస్తాడు. మీ యొక్క సమస్యలన్నిటి నుండి మీకు విడుదలను కలుగజేస్తాడు. నేడు ప్రభువు వైపు చూచు అలవాటు మీకున్నదా? అయితే రండి! ప్రభువును గట్టిగా పట్టుకుందాము. ఆయనకు మొఱ్ఱపెడదాము. ఆయన మీకు సమాధానమును మరియు ఓదార్పును, ఆదరణను ఇస్తాడు. మీరు నడవవలసిన మార్గమును మీకు సూచిస్తాడు. ఇంకను మీరు నడవవలసిన మార్గమును మీకు తెలియజేస్తాడు. కనుకనే, ఆయన యొద్దకు వచ్చి, ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయన సన్నిధిలో వేచియుంటూ, ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నేడు నీ వాక్యము ద్వారా మా హృదయాలను తాకుము. ప్రభువా, మేము లోక సమస్యల చేత మేము ఇబ్బందుల పాలై ఉన్నాము. దేవా, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము, నీవే, మాకు ఆదరణను, ఓదార్పును మరియు మాకు విశ్రాంతి దయచేయుము. దేవా, మా చేతులను పట్టుకొనుము, మేము నడవవలసిన మార్గమును మాకు తెలియజేయుము. ప్రభువా, నీ మార్గములను మాకు నేర్పించి, మమ్మును దీవించుము. దేవా, మా భారములన్నిటితోను, చింతలన్నిటితోను మేము నీ యొద్దకు వచ్చుచున్నాము, మమ్మును అన్ని వైపుల నుండి చుట్టుముట్టిన కష్టాలను నీవు చూచుచున్నావు. ప్రభువా, నీ వాగ్దానము చొప్పున మాకు అన్ని వైపుల నుండి విశ్రాంతిని దయచేయుము. దేవా, మా పూర్ణ హృదయముతో నిన్ను వెదకుటకు మాకు నేర్పుము. ప్రతిదినము నీ వాక్యమును చదివి, దానిని గట్టిగా పట్టుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ వాక్యము మా ఆత్మను ఓదార్చి, మాకు జీవమును ఇచ్చునట్లుగా చేయుము. ప్రభువా, సరైన సమయములో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. దేవా, మా మొరను ఆలకించి, మా సమస్యలన్నిటి నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, మేము వెళ్ళవలసిన మార్గములో మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


