హలో నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. అయితే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 21:20వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును'' అని సెలవిచ్చుచున్నది. అవును, ఈ వచనమును చదివినప్పుడు లోకములో ఉన్న ప్రజలు చెప్పు అనేక సామెతలు మనకు గుర్తుకు వస్తాయి. రేపు అనేది లేనట్టుగా ఈ రోజు జీవించు అని అంటుంటారు. ఆలాగుననే, బైబిల్‌లో, " రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును '' అని చెప్పబడినట్లుగానే, 'రేపటిని గురించి చింతించవద్దు,' అని చెబుతారు. 'ఈ రోజును వినియోగించుకోండి' అని అంటారు కదా. రేపు అనేది ఎలా ఉంటుందో, ఎప్పుడు ప్రమాణము చేయబడలేదు అని అంటారు. ఈలాంటి మాటలు అన్నియు విని, ఈ రోజు వరకు జీవించినట్లయితే చాలు అని చాలామంది అనుకుంటారు. ఈ రోజు గడిచిపోయినట్లయితే, చాలు అని అనుకుంటారు. రేపటిని గురించి నేను చింతించనవసరము లేదు అని భావిస్తారు. వారి యొక్క భవిష్యత్తును గురించి వారు అస్సలు ఆలోచించరు. దాచిపెట్టుకోవడము గురించి అస్సలే ఆలోచించరు. ఏదైనా ఒక ప్రమాదము జరిగినప్పుడు, ఏమి ఉండదు. కరోనా వైరస్ మహమ్మారి వచ్చినప్పుడు, అనేకమంది జీవితాలలో అదే మనము చూచియున్నాము. ఆకస్మాత్తుగా ఉద్యోగములు కోల్పోవడము వలనను, డబ్బు ఏమియు లేకపోవడము వలన వారు ఎంతగానో కష్టాలపాలైయ్యారు. భోజనపు బల్ల మీద ఆహారము కూడా తినలేని పరిస్థితి ఏర్పరడినది. వారి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి. అనేకమంది ఆ విధంగా కష్టాలపాలైయ్యారు.

బైబిల్ గ్రంథములో అటువంటి ఒక కష్టమైన పరిస్థితిలో దాచిపెట్టబడినటు వంటి ఒక వ్యక్తిని మనము చూడగలము. ఏడు సంవత్సరములు కరువు రాబోవుచున్నదని దేవుడు యోసేపునకు తెలియజేశాడు. ఆ కరువుకంటె ముందుగా ఏడు సంవత్సరముల సమృద్ధి కూడా ఉండబోవుచున్నది అని చెప్పాడు. దేశములోని ధాన్యమంతటిని సమకూర్చుకొను విధానమును ప్రభువు యోసేపునకు అనుగ్రహించియున్నాడు. ప్రతి పట్టణము నుండి, ప్రతి పొలము నుండి కూడా లెక్కలేనంత ధాన్యమును అతడు సమకూర్చా డు. కరువు వచ్చినప్పుడు, ప్రజలందరు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ధాన్యమును కొనడము ప్రారంభించారు. మొదట ధాన్యమును కొనుక్కొనియున్నారు. ఆ తర్వాత, వారి యొక్క పశువులను అమ్మి కూడా ధాన్యమును కొన్నారు, ఆ తర్వాత, వారి యొక్క భూములను కూడా కొన్నారు. ఆ విధంగా ఐగుప్తు ప్రజలందరు కూడా ఫరోకు బానిసలుగా మార్చబడ్డాడు. అందుకనే, ఫరో రాజు యోసేపును హెచ్చించి, అతనిని ఘనపరచాడు.

నా ప్రియులారా, అదేవిధముగా ప్రభువు మీకు కూడా జ్ఞానమును అనుగ్రహిస్తాడు. మీ భవిష్యత్తు కొరకు మరియు మీ కుటుంబము కొరకు మీరు దాచిపెట్టుకోవడము కొరకు దేవుడు మీకు తన యొక్క జ్ఞానమును అనుగ్రహిస్తాడు. బైబిల్ నుండి సామెతల గ్రంథములో మనము చదివినట్లుగానే, ఆయన మీకు చక్కని నడిపింపును అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథములో కూడా, రేపటిని గూర్చి మీరు చింతించకండి అని వ్రాయబడియున్నది కదా అని మీరు అనవచ్చును. అవును, ప్రియ స్నేహితులారా, రేపటిని గూర్చి చింతించనక్కర్లేదు. కానీ, అయితే, రేపటిని గూర్చి సిద్ధంగా ఉండు జ్ఞానమును ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు.

నా ప్రియులారా, ఒకవేళ నేను సంపాదించుచున్నది, నా జీవితమునకు సరిపోయినంత మట్టుకు మాత్రమే ఉంటుంది అని మీరు అనవచ్చును. నాకు ఇంకా సంపాదనకంటె ఎక్కువగా మరి ఏదియు కూడా రాలేదు అని అంటున్నారేమో? నాకు ప్రస్తుతము గడిచిపోవడానికి సరిపడినంతగా వస్తుందని మీరు తలంచుకొనుచున్నారేమో? నా కుటుంబమును, ఎలా పోషించుకోవాలి, ఎలా పరామర్శించాలి? అని చింతించుచున్నారేమో? ప్రస్తుతము మా ఆదాయమునకు సరిపడ ఖర్చులకు కూడా నేను సమకూర్చుకొనలేకపోవుచున్నాను అని అనుకుంటున్నారా? అయితే, బైబిల్ గ్రంథము నుండి ఫిలిప్పీయులకు 4వ అధ్యాయములో సెలవిచ్చినట్లుగానే, ప్రభువు మీ యొక్క అవసరతలన్నిటిని కూడా తీరుస్తాడు. ఆయన మిమ్మును అభివృద్ధి నొందిస్తాడు. కాబట్టి, నా ప్రియులారా, మీ విశ్వాసమును ప్రభువునందు ఉంచండి. ఆయన మీకు జ్ఞానమును ఇస్తాడు. ఆయన మిమ్మును వర్థిల్లింపజేస్తాడు. మీరు కూడా యోసేపువలె ఇతరులకు సహాయపడతారు. ప్రభువు మీకు పట్టజాలనంతగా పొంగిపొర్లు ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. మీరు కూడా లెక్కింపలేనన్ని ఆశీర్వాదములను ప్రభువు మీకు ఇస్తాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ధైర్యముగా ఉండండి. ప్రభువు యొద్ద నుండి ఈ రోజు ఈ వాగ్దానము పొందుకొనండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు మా నమ్మకమైన పోషకునిగాను మరియు ప్రతి మంచి బహుమతికి మూలమైనందుకు నీకు వందనములు. దేవా, నీవు మాకు అప్పగించిన ప్రతి ఆశీర్వాదాన్ని నిర్వహించ డానికి నీ పరలోక జ్ఞానంతో మమ్మును నింపుము. ప్రభువా, మా భవిష్యత్తు గురించిన ప్రతి భయాన్ని, ఆందోళనను తొలగించి, నీవు తప్పక అందించే దానిపై పూర్తిగా నమ్మకం ఉంచునట్లుగా మాకు నేర్పించుము. దేవా, మా యొక్క సమృద్ధి కాలంలో సిద్ధపడటానికి నీవు యోసేపునకు జ్ఞానమును ఇచ్చినట్లుగానే, మా కుటుంబం మరియు భవిష్యత్తు కోసం తెలివైన నిర్ణయా లు తీసుకోవడానికి మాకు కూడా అదే జ్ఞానమును అనుగ్రహించుము. ప్రభు వా, ఈ రోజు ఆర్థిక సమస్యల కొరకు చింతించుచున్న మా జీవితములో ఉన్న చింతలన్నిటిని తొలగించి, మాకు సమృద్ధిని దయచేయుము. దేవా, మా కుటుంబమును పోషించుకొనుటకు మాకు కావలసిన జ్ఞానమును, మరింత వనరులను దయచేయుము. దేవా, యోసేపు ఇచ్చిన జ్ఞానమును మాకు అనుగ్రహించి, దానిని యోసేపు అనేకులకు పంచి పెట్టి, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగానే, అదే ఆశీర్వాదమును మేము కలిగియుండునట్లుగా మాకు నీ కృపను ఇమ్ము. దేవా, మా అవసరతలన్నింటిని క్రీస్తు యేసులో మహిమలో తీర్చుము. ప్రభువా, మా చేతుల కష్టార్జితమును వృద్ధిలోకి తీసుకుకొనిరమ్ము. దేవా, నీ యొక్క సంపూర్ణమైన చిత్తానుసారంగా మా ఆర్థిక విషయాలను ఆశీర్వదించుము.. దేవా, యోసేపు వలె అవసరతలో ఉన్నవారికి మేము సహాయపడునట్లుగా మా హస్తములను నింపుము. దేవా, మేము అన్నిటిలోను తగిన జ్ఞానమును పొందుకొని నీ నామమునకు మహిమ తీసుకొనివచ్చునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.