నా ప్రియులారా, ఈ నూతన మాసములో ప్రవేశించిన మిమ్మును దేవుడు దీవించును గాక. ఈ నూతన మాసములో ప్రభువు మీ జీవితములో దుఃఖము పెరుగుట కొరకు కాకుండ, ఆయన యొక్క మేలులను మీరు అనుభవించుటకును మరియు మిమ్మును ఇతరుల కొరకు ఆశీర్వాదకరముగా మార్చుటకును ఆయన మీరు జీవించు దినములను మరియు సంవత్సరములను అధికపరచుచున్నాడు. ఈ నెల కొరకు వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 15:2వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను'' అని చెప్పబడినట్లుగానే, ఇది ఎంత చక్కటి పిలుపు! దేవుడు మనలను కుటుంబములలోను, పొరుగు ప్రాంతములలోను, ఉద్యోగ స్థలములలోను, పాఠశాలలోను మరియు సముదాయములలోను కేవలం మన కొరకు జీవించుటకు ఉంచలేదు. కానీ, మన చుట్టు ఉన్నవారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా జీవించవలెనని ఆశించుచున్నాడు. ఎందుకనగా, క్రీస్తు మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఇతరులను కూడ ప్రేమించవలెనని తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి యోహాను 13:34వ వచనములో చూచినట్లయితే, "యేసు, మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను'' అని సెలవిచ్చినట్లుగానే, దీనిని అర్థము చేసుకొనుటకు, యేసు తన శిష్యులతో వ్యవహరించిన విధానమును చూడండి. వారు తప్పులు చేశారు. వారు ఆయనను అపార్థం చేసుకొన్నారు. కొన్ని సమయములలో వారు భయముతోను మరియు స్వార్థముతోను నడుచుకొన్నారు. అయినను యేసు వారిని విడిచిపెట్టలేదు. ఆలాగుననే, దేవునికి మిమ్మును మీరు సమర్పించుకొనినప్పుడు, ఆయన మిమ్మును తన యొక్క ప్రేమతోను, కనికరముతోను, అభిషేకముతోను నింపును మరియు ఇతరుల జీవితములను ముట్టుటకు మీ ద్వారా క్రియ చేయును. మీ ద్వారా వారి జీవితములలోనికి వచ్చిన ఆశీర్వాదమును ప్రజలు గుర్తించెదరు. "మా పొరుగింటిలో మీరు ఉన్నందున, మేము ఆశీర్వదింపబడ్డాము'' అని వారు చెప్పెదరు. ఇతరుల ఆశీర్వాదము మరియు క్షేమాభివృద్ధి కొరకు మీరు జీవించినట్లయితే, మీరు కూడ దేవుని అత్యధికమైన మేలులను మరియు కృపను మీ జీవితములో అనుభవించెదరు.
నా ప్రియులారా, క్రీస్తు నుండి పొందుకొనిన అదే ప్రేమను మనము ప్రజల పట్ల చూపించినప్పుడు, ఆయన ప్రేమ మన జీవితములలో కూడ కనిపించును మరియు ప్రజలు బలపరచబడుదురు. కొన్ని సమయములలో, ఈ ప్రేమ మనలను బాధపెట్టినవారిని లేక, మనలను నిందించిన వారిని క్షమించి, మనస్ఫూర్తిగా వారి మేలు కోరుకొనునట్లు చేయును. ఒకసారి, ఒక ప్రార్థన కూటములో, పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రతిఒక్కరిని ప్రార్థన చేయమని వాక్యోపదేశకుడు కోరెను. ప్రతిఒక్కరు, 'ప్రభువా, నేను నీ ఆత్మతో నింపబడవలెను. నేను యేసువలె మారవలెను మరియు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండవలెను' అని ప్రార్థన చేయుటకు ప్రారంభించాడు. అనేకులు పరిశుద్ధాత్మ అభిషేకమును అనుభవించారు. కానీ, కొందరు వారు వెదకినను దానిని పొందలేదు. అప్పుడు ఆ బోధకుడు, ప్రార్థన నిలిపి వేసి, 'మీరు ఎవరి మీదనైనను ద్వేషమును కలిగియున్నట్లయితే, ముందుగా వారిని క్షమించండి. వారు మీకు ఎటువంటి చెడు చేసినను, వారిని ప్రేమించండి. ద్వేషమును ప్రక్కనపెట్టి, మీ హృదయమును ప్రేమతో నింపుకోండి' అని చెప్పారు. వెంటనే, ఒక వ్యక్తి లేచి బయటకు పరుగెత్తెను. కొంత సమయము తరువాత, అతను తిరిగి వచ్చి, మోకరించి ప్రార్థించెను. దేవుని ఆత్మ అతని మీదికి శక్తివంతముగా దిగివచ్చెను. కూటము ముగిసిన తరువాత, ఆ బోధకుడు, అతను ఎక్కడికి వెళ్లెనని అడిగారు. అందుకు అతను, 'మా అక్క నా భూమిని మరియు ఆస్తిని ఆక్రమించుకొనినది. నాకు ఏమియు మిగులలేదు. నేను తనను అనేకసార్లు బ్రతిమిలాడాను కానీ ఆమెలో ఎటువంటి మార్పు కలుగలేదు. వారు నన్ను తరిమివేశారు. కానీ ఇప్పుడు నేను మా అక్క ఇంటికి వెళ్లి, జరిగినవాటన్నిటి నిమిత్తము నేను నా హృదయములో నీ మీద ద్వేషమును ఉంచుకొనుటలేదు. దయతో నేను నీతో కోపముతో మాటలాడినందుకు నన్ను క్షమించమని తన వద్ద క్షమాపణ కోరాను.' ఆవిధంగా అతను చెప్పుచున్నప్పుడు, అతని కళ్లలో నుండి కన్నీరు కారుచుండెను. అతను, ' అది నాలోని ద్వేషమును తొలగించింది. నా హృదయములో సమాధానము కలిగింది మరియు నేను తిరిగి ఇక్కడికి పరుగున వచ్చాను. నేను దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన నా మీద తన ఆత్మను కుమ్మరించెను. నేను ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడ్డాను!' అని చెప్పాడు. ప్రియులారా, ఇదే సమాధానము చేయు ఆత్మ. ఇదే నిబంధనలేని ప్రేమ. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 3:13వ వచనములో చూచినట్లయితే, "ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి'' అని సెలవిచ్చుచున్నది. మనము ద్వేషమునకు బదులుగా క్షమాపణను, అసంతృప్తికి బదులుగా ప్రేమను ఎంపిక చేసుకొనినప్పుడు, క్రీస్తు ప్రేమ మన ద్వారా ప్రవహించును మరియు ఇతరులకు క్షేమము కలుగజేయును. ఆలాగుననే, మనము ఇతరుల భారములను మోయవలెను. ప్రేమ మన హృదయములలో ఉంటే చాలదు; ఇది మన క్రియల ద్వారా వ్యక్తపరచవలెను. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 6:2వ వచనములలో చూచినట్లయితే, " ఒకని భారముల నొకడు భరించి, యాలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి'' అని సెలవిచ్చుచున్నది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, ఒంటరితనం లేదా ఇతర పోరాటాలను ఎదుర్కొంటున్న వారి పట్ల మనము కనికరముతో స్పందిస్తూ, సాధ్యమైన చోట ఆచరణాత్మక సహాయమును అందించుదాము. మనం ఇతరుల భారములను మోయుచున్నప్పుడు, ప్రభువు మనలను ఆదుకొని బలపరుస్తాడు.
నా ప్రియులారా, నిరీక్షణను ఇచ్చే మాటలను మాటలాడండి మనము, ఇతరులకు చేయు క్రియల ద్వారా వారికి క్షేమాభివృద్ధిని కలుగజేయుట మాత్రమే గాక, మనము మాటలాడు మాటల ద్వారా కూడ ఆశీర్వాదకరముగా ఉండెదము. అందుకే బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 5:11వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి'' అని సెలవిచ్చుచున్నది. ప్రియులారా, కొన్ని సమయములలో ఒక వ్యక్తికి తమ ప్రక్కన నిలిచి, సరైన మాటలను మాటలాడి, దేవుడు వారిని మర్చిపోలేదని గుర్తుచేసే తోడు ఉంటే చాలు. ఇందుకొరకు ప్రభువు మనకు ప్రవచనాత్మక వాక్యములను, జ్ఞానమును మరియు కృపను అనుగ్రహించును. నా పిల్లలు కాలేజీ చదువుచున్నప్పుడు, దేవుడు అనేకసార్లు వారి కొరకు ప్రత్యేకమైన వాక్యమును అనుగ్రహించేవాడు. కొన్ని సమయములలో, వారు కాలేజీకి బయల్దేరుచున్న ఆ సమయములో ఆయన నా హృదయములో వాక్యమును ఉంచును. నేను వారికి ఫోన్ చేసి, ఈనాడు ప్రభువు నీకు అనుగ్రహించిన వాక్యము ఇదే అని చెప్పెదను. ఆ సమయములో, వారి కన్నీటితో, "నాకు కావలసినది ఇదే'' అని చెప్పెదరు. ఆ ఒక్క వాక్యము వారిని ప్రోత్సహించును, వారి విశ్వాసమును బలపరచును మరియు వారిని దేవునికి సమీపముగా తీసుకొనివచ్చును. ఈనాటికీ, వారును మరియు వారి కుటుంబములు దేవుని ప్రవచనాత్మక కృప ద్వారా నడిపించబడుచున్నారు. కానీ, సరైన మాట మాటలాడుటకు, ముందుగా మనకు సరైన హృదయము ఉండవలెను. మనకు కనికరముగల హృదయము అవసరమైయున్నది. మా కుటుంబములో తరతరములుగా ఈ కనికరమును కలిగియుండుటకు ప్రభువు కృప చూపించుచున్నాడు. ప్రభువు ఒకసారి నా తండ్రియైన డి.జి.యస్.దినకరన్గారితో, "నా కుమారుడా, కనికరముతో నిండిన నా హృదయమును నేను నీకు ఇచ్చెదను. నీవు ఇతరుల యొక్క బాధలను వినినప్పుడు, వారి బాధ నీ సొంత బాధగా భావించి, వారి కొరకు నీవు కన్నీరు కార్చెదవు. కనికరముతో నిండిన నీ కన్నీటిని చూచి, నీవు ఎవరి కొరకైతే కన్నీరు విడుచుచున్నావో వారి అవసరములను నేను తీర్చెదను అని చెప్పెను.'' ప్రభువు మా కుటుంబమునకు కూడ అదే కృపను రెండంతలు అనుగ్రహించెదనని మాతో మాటలాడెను. 1994, అక్టోబర్ 2వ తేదీన, చెన్నైలో నిర్వహించబడిన ఒక ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేయుచున్నప్పుడు ప్రభువు నాకు ఈ వాగ్దానమును జ్ఞాపకము చేసెను. ఆయన, 'నీవు ప్రజల కొరకు కన్నీరు విడిచినప్పుడు, నేను వచ్చి, నీ కన్నీటిని చూచెదను. ప్రజల కొరకు కనికరముతో నీవు కార్చిన కన్నీటిని నేను చూచినప్పుడు, వారి కన్నీటిని తుడిచివేయుదును అని చెప్పెను.' ఈనాటి వరకు ప్రభువు ఈ వాగ్దానమును నెరవేర్చుచూనే ఉన్నాడు. నా ప్రియులారా, దేవుడు మనలో ఇదే కనికరమును పెంపొందించవలెనని మన పట్ల కోరుకుంటున్నాడు, తద్వారా మనము ఇతరుల బాధను గుర్తించడమే కాకుండా, ప్రేమపూర్వకమైన చర్య మరియు హృదయపూర్వక ప్రార్థన ద్వారా
నా ప్రియులారా, మీ జీవితములోనికి దేవుడు తీసుకొనివచ్చు ప్రతిఒక్కరి ద్వారా ఆయన యొక్క ప్రేమను చూపించుటకు మీకు ఆవకాశము కలుగును. ఇతరుల భారములను మోయుటకును, నిరీక్షణగల మాటలను మాటలాడుటకును మరియు మీరు ఎక్కడికి వెళ్లినను ఆశీర్వాదకరముగా ఉండుటకును ఆయన మీకు కృపననుగ్రహించును గాక. మీరు ఈ పిలుపు ప్రకారం నడుచుకొనినప్పుడు, ప్రభువు మీ ఇంటిని కట్టును మరియు మీ కుటుంబమును స్థిరపరచును. మీ పిల్లలు ప్రవక్తలుగా సిద్ధపరచబడుదురు, దేవుని సన్నిధి మీ కుటుంబ సభ్యుల మీద నిలిచియుండును మరియు మీ కుటుంబము మీ చుట్టు ఉన్న ప్రజలకు మరియు దేశమునకు వెలుగునిచ్చును. నేటి వాగ్దాన సందేశము నుండి దేవుడు ఈ మాసమంతయు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు నీవు మమ్మును పిలిచినందుకై నీకు వందనములు. ప్రభువా, మా హృదయమును నీ ప్రేమ మరియు కనికరముతో నింపుము. యేసయ్యా, నీవు మమ్మును ప్రేమించినట్లుగానే మేము కూడా ఇతరులను ప్రేమించుటకు మాకు నేర్పించుము. దేవా, మమ్మును బాధపెట్టిన వారిని క్షమించడానికి మరియు ప్రతి సంబంధంలో శాంతి సమాధానమును కోరుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ఇతరుల బాధను గుర్తించే హృదయమును మరియు వారి భారములను పంచుకునే సంసిద్ధతను మాకు అనుగ్రహించుము. దేవా, అలసిపోయిన మమ్మును బలపరచుటకు మాకు జ్ఞానము, ఆదరణ మరియు ప్రోత్సాహకరమైన మాటలను అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క శక్తి ద్వారా ప్రతి ఒక్కరితో దయ, సహనము మరియు అవగాహనతో స్పందించడానికి మమ్మును నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


