నా ప్రియమైన వారలారా, మనము ఈ సంవత్సరము చివరి రోజునకు వచ్చియున్నాము. కనుకనే, దేవుడు మనకు ఈ సంవత్సరమంతయు చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఇంకను రాబోవు నూతన సంవత్సరమంతయు మనలను ఆయన కృప వెంబడించాలని నేను మీ పట్ల కోరుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 23:6 వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' అని సెలవిచ్చిన ప్రకారము దేవుని యొక్క దయ మరియు మనుష్యుల యొక్క కనికరము, ఇంకను మీ కుటుంబ సభ్యుల యొక్క దయ మరియు చివరికి, మీ శత్రువుల యొక్క దయ కూడా మీకు కలుగుతుంది. కనుకనే, భయపడకండి, ధైర్యముగా ఉండండి. ఎందుకంటే, సమస్తము మీ జీవితములో మీకు మేలు జరుగుతుంది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 100:5వ వచనమును చూచినట్లయితే, "యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును'' ప్రకారము అన్ని విషయాలలో ఆయన కృప నిత్యముండును. ఇంకను బైబిల్ నుండి యాకోబు 1:17వ వచనములో చూచినట్లయితే, "శ్రేష్ఠమైన ప్రతి యావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు'' ప్రకారము "శ్రేష్ఠమైన ప్రతి యావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చునని ఈ వచనము మనకు గుర్తుచేయుచున్నది. దేవుడు మీ జీవితములోనికి ఎటువంటి అంధకారమును అనుమతించడు. కాబట్టి, మీ జీవితము సకలవిధమైన వెలుగుతో నింపబడుతుంది.

నా ప్రియులారా, నేడు మీ జీవితమంతయు సమస్తమును వెలుగుతో నిండి ఉంటుంది. అందుకే యేసు ఇలాగున బైబిల్ నుండి సెలవిచ్చుచున్నాడు, మత్తయి సువార్త 7:11వ వచనమును మనము చూచినట్లయితే, " పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యావుల నిచ్చును" అని చెప్ఫబడినట్లుగానే, నిశ్చయముగా దేవుడు మీకు మంచి యీవులను నేడు దయచేయుచున్నాడు. కాబట్టి బైబిల్ నుండి యిర్మీయా 32:40వ వచనములో చూచినట్లయితే, " నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను'' ప్రకారము ఎన్నటికిని దేవుడు మీకు మేలు చేయకుండమానడు. కనుకనే, ఈ సంవత్సరమంతయు మీరు మాతో కూడా ఉన్నారు. అందునుబట్టి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఆయన కనికరము మరియు ఆయన కృప మిమ్మును నిత్యము వెంబడించును గాక.

నా ప్రియులారా, ఈ సంవత్సరమంతయు దేవుని యొక్క కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగానే, రాబోవు సంవత్సరమంతయు అదే దేవుని యొక్క కృపాక్షేమములు మనలను వెంబడించును గాక. అందుకే బైబిల్ నుండి విలాపవాక్యములు 3:22వ వచనములో చూచినట్లయియితే, "యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము'' ప్రకారము దేవుడు కృపగలవాడు గనుకనే, మనము నిత్యము నిలిచియున్నాము. కనుకనే, పాపం మనలను మింగివేయలేకపోయినది. అంతమాత్రమే కాదు, అనారోగ్యం మనలను మ్రింగివేయలేకపోయినది. ఇంకను దుర్మార్గులు మనలను మ్రింగివేయలేకపోయారు. ఆలాగుననే, సాతాను మనలను మ్రింగివేయలేకపోయాడు. దేవుని ప్రేమ మరియు దేవుని దయ కారణంగా మనం అన్నిటికంటెను అత్యధికమైన విజయమును పొందుకొనుచున్నాము. కాబట్టి, నా ప్రియులారా, ఈ సంవత్సరం ప్రతి ఉదయం ఆయన కృప నూతనంగా ఉంటుంది, మరియు ఆ కృప ఈ నూతన సంవత్సరంలో కూడా మీకు దొరుకుతుంది. నేడు స్నేహితులారా, నిత్యము నిలిచియుండు ఆయన కృపను బట్టి మనం ప్రభువును స్తుతించుదాము. ఈ చివరి దినమున మనం కొన్ని నిమిషాలు ప్రభువును స్తుతించుదామా? ఆలాగున ఆయన మనకు చేసిన మేలులన్నిటిని తలంచి, ఆయనను స్తుతించినట్లయితే, నిశ్చయముగా, రాబోవు నూతన సంవత్సరములో దేవుడు మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుని యొక్క కృపాక్షేమములు మీ వెంట వచ్చునట్లుగా చేసి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
స్తుతులకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును ఈ సంవత్సరము చివరి రోజునకు మరియు గడియలకు తీసుకొని వచ్చినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ సంవత్సరమంతయు నీవు మాకు చేసిన మేలులను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ప్రతిరోజు మమ్మును వెంబడించుచున్న నీ మంచితనం మరియు దయకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీ యొక్క నూతన వాత్సల్యత ద్వారా ప్రతిరోజు నీవు మమ్మును కాపాడుచున్నందుకై మేము నిర్మూలము కాకున్నాము. దేవా, మా యొక్క పాపం, అనారోగ్యం మరియు కీడు నుండి మమ్మును దూరంగా ఉంచినందుకు నీకు వందనాలు. ప్రభువా, మా జీవితంలోని చీకటినంతా పారద్రోలి, నీ వెలుగును మా పట్ల కుమ్మరించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మేము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుచున్నప్పుడు, నీవు మాకు మేలుచేయకుండా ఎన్నటికిని మానవని మా హృదయములో మేము నమ్మునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీవు దయచేసి మా జీవితాన్ని నీ పరిపూర్ణ ప్రతిఫలంతో మరియు పరలోకము నుండి వచ్చిన యీవులతో నింపుము. ప్రభువా, మేము నిన్ను స్తుతించుచున్నాము మరియు మేము నిన్ను నిత్యము నమ్మునట్లుగా కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.